రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్‌లో సినిమా చూసేందుకు ప్రియాంక, మరో వైద్య విద్యార్థితో కలిసి వెళ్లారు. థియేటర్ వద్ద రద్దీ కారణంగా వాహనాలు నిలిచిన సమయంలో నామవరానికి చెందిన దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఢీకొట్టిన తర్వాత కూడా కారు ఆగకుండా మరోసారి బలంగా ఢీకొనడంతో ప్రియాంక కిందపడిపోయారు. అనంతరం కారు ఆమెపై నుంచి వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి.
థియేటర్ వద్దే గొడవ:
ప్రమాదానికి ముందు ఇద్దరు యువకులు మద్యం సేవించి సినిమా థియేటర్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నారని భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో టికెట్ల డబ్బు తిరిగి ఇవ్వాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత పార్కింగ్ నుంచి కారును దూకుడుగా బయటకు తీసుకొచ్చి వైద్య విద్యార్థుల వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరినీ గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.



















