అమరావతి, అక్టోబర్ 30:
రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల సేతగా ‘నైపుణ్యం’ పోర్టల్ నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతీ నెలా, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని సూచిస్తూ, 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా కృషి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
సచివాలయంలో గురువారం జరిగిన నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత విద్యకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నవంబర్‌లో జరగనున్న భాగస్వామ్య సదస్సులోగా ‘నైపుణ్యం’ పోర్టల్‌ను ప్రారంభించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్టింగ్ అనంతరం అధికారిక ధృవపత్రాలు ఇవ్వాలని సూచించారు.
క్లస్టర్ బేస్డ్ శిక్షణ – పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా
నైపుణ్యాభివృద్ధి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా రాష్ట్రంలో స్పేస్, ఆక్వా, క్వాంటం వంటి రంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు నైపుణ్యవంతులైన మానవ వనరులను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని తెలిపారు.
దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాల వివరాలు, అవసరమైన నైపుణ్యాల సమాచారం అందించేలా పోర్టల్ రూపకల్పన జరుగుతోందని తెలిపారు.
సమగ్ర డేటాబేస్ – ఏఐ ఆధారిత సదుపాయాలు
ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన జాబ్ మేళాల ద్వారా 1.44 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు సీఎంకు నివేదించారు.
నైపుణ్యం పోర్టల్‌లో అభ్యర్థులు ఏఐ సహాయంతో రెజ్యూమ్ తయారు చేసుకోవచ్చని, వాట్సప్ ద్వారా ఉద్యోగ సమాచారం అందిస్తామని వెల్లడించారు.
అన్ని శాఖల డేటాను సమీకరించి నిజమైన నిరుద్యోగులను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు.
అభ్యర్థులకు శిక్షణ, ఉద్యోగ మేళాల వివరాలు, ఖాళీల సమాచారం, అలాగే ఇంటర్వ్యూ సిద్ధత కోసం ఏఐ సిమ్యులేటర్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని వివరించారు.
విదేశీ ఉద్యోగాల దిశగా భాషా శిక్షణ
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “పోర్టల్ ద్వారా ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలను అనుసంధానించాలి. విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం చేయాలి. విదేశీ ఉద్యోగావకాశాలను సులభతరం చేయడానికి ఆయా దేశాల భాషల్లో శిక్షణ ఇవ్వాలి. ఏపీ ఎన్‌ఆర్టీ ద్వారా కూడా విదేశీ ఉద్యోగ సమాచారాన్ని అందించాలి” అని ఆదేశించారు.
“నైపుణ్యం పోర్టల్ ద్వారా ప్రతి యువకుడికి తగిన నైపుణ్య శిక్షణ, పునశిక్షణ, అభివృద్ధి అవకాశాలు అందించి వారి భవిష్యత్తు బలపడేలా చూడాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.





















