ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచకప్ ఉత్కంఠభరిత దశలోకి చేరుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌పై విజయం సాధించి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు రెండో సెమీఫైనల్‌లో భారత్–ఆస్ట్రేలియా (INDW vs AUSW) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ నవీ ముంబయిలో జరుగుతోంది. అయితే, కీలకమైన ఈ పోరులో వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 5.1 ఓవర్లు ఆడిన తర్వాత వరుణుడు తన దెబ్బ చూపించాడు. చిన్నపాటి వర్షం కారణంగా ఆట నిలిచిపోయి, కొంతసేపటి తరువాత మళ్లీ ప్రారంభమైంది. అయితే, మ్యాచ్ కొనసాగుతున్నప్పటికీ వర్షం మరోసారి అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి.
రిజర్వ్ డే ఉందా?
ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డే (Reserve Day)ను ఏర్పాటు చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించలేకపోతే, అదే రోజు ఓవర్లను తగ్గించి ఫలితం తేల్చేందుకు ప్రయత్నిస్తారు. అది సాధ్యం కాకపోతే మ్యాచ్‌ను రిజర్వ్ డేకు తరలిస్తారు. ఆట ఆగిన చోట నుంచే మరుసటి రోజు కొనసాగుతుంది.
అయితే, రిజర్వ్ డే నాడు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 13 పాయింట్లతో, భారత్ 7 పాయింట్లతో లీగ్ దశ ముగించినందున, మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ ఇవాళే ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రిజర్వ్ డే అయిన అక్టోబర్ 31న ముంబయిలో వర్షం పడే అవకాశం 84 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చివరికి వర్షం కారణంగా ఫలితం రెండు రోజుల్లోనూ తేలకపోతే, ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది.




















