ముంబయి: బంగారం/వెండిని ముడి పదార్థంగా వినియోగించి, ఆభరణాలు/వస్తువులు తయారు చేసేవారికీ మూలధన నిధులుగా రుణాలు అందించడానికి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఆభరణాల విక్రేతలకు మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంది. పసిడి/వెండిని కొనుగోలు చేసేందుకు రుణాలు ఇవ్వకుండా బ్యాంకులపై నిషేధం ఉంది. అయితే ఆభరణదాలను తనఖా పెట్టుకుని రుణాలివ్వడానికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు(ఎస్‌సీబీ)లకు ఆర్‌బీఐ నుంచి అనుమతులున్నాయి. తాజాగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. పసిడిని ముడి పదార్థంగా లేదా తమ తయారీ/పారిశ్రామిక ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో వాడేవారికి సైతం బ్యాంకులు రుణాలివ్వవచ్చు. అయితే వీరు పసిడిని పెట్టుబడులు/స్పెక్యులేషన్ కోసం కొనుగోలు చేసే/అట్టేపెట్టిఉంచుకోకూడదని స్పష్టం చేసింది.
పరపతి విధానానికి నిర్వహణ లక్ష్యంగా ఓవర్‌నైట్ యావరేజ్ కాల్ రేట్ (డబ్ల్యూఏసీఆర్)ను వినియోగించడం కొనసాగిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇంటర్‌బ్యాంక్ కాల్ మనీ మార్కెట్‌లో చాలా తక్కువ సమయానికి (ఓవర్‌నైట్) పరస్పరం బ్యాంకులు రుణాలిచ్చుకునే సగటు వడ్డీ రేటును డబ్ల్యూఏసీఆర్‌గా వ్యవహరిస్తారు.




















