హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలో ఓ వైద్యుడి ఇంటిపై పోలీసులు దాడి చేసి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న జాన్‌పాల్ అనే వైద్యుడు డ్రగ్స్ విక్రయిస్తున్నాడన్న సమాచారంతో ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో రూ.3 లక్షల విలువైన ఓజీకుష్, ఎండీఎంఏ, కొకైన్, హాష్ ఆయిల్ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
జాన్‌పాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఈ డ్రగ్ రాకెట్‌లో ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు కూడా ఉన్నారని గుర్తించారు. వీరు దిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి డ్రగ్స్ తెప్పించి, వైద్యుడి ఇంట్లో నిల్వచేసి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ అమ్మకాల్లో సహకరించినందుకు వైద్యుడికి కొంత మత్తు పదార్థం ఉచితంగా ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు వెల్లడించారు.




















