రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్ కంపెనీలు, అనుబంధ సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రకటించింది. మనీలాండరింగ్ దర్యాప్తు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ విషయంపై అంబానీ లేదా ఆయన సంస్థల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఏ ఆస్తులను జప్తు చేశారు?
పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద అక్టోబర్ 31న నాలుగు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన ఈడీ, మొత్తం 42 ఆస్తులను అటాచ్ చేసింది. వీటిలో ముంబయిలోని పాలిహిల్‌లో అంబానీ నివాసం, ఆయన గ్రూప్ కంపెనీలకు చెందిన నివాస, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. అదనంగా హైదరాబాద్‌లోని కామస్ కాప్రి అపార్ట్‌మెంట్స్, ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలోని ఆస్తులు కూడా ఉన్నాయి. ముంబయి, నోయిడా, ఢిల్లీ, థానే, పుణె, చెన్నై, ఘజియాబాద్ ప్రాంతాల్లోని ఆస్తులనూ అటాచ్ చేశారు.
ఒక్క ఆస్తే రూ.4,462 కోట్లు విలువ!
నవీ ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏకేసీ)కి చెందిన 32 ఎకరాల భూమిని కూడా ఈడీ అటాచ్ చేసింది. దీని విలువే సుమారు రూ.4,462 కోట్లు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకు మోసం కేసులో భాగంగానే ఈ చర్య తీసుకున్నారు. మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.7,545 కోట్లకు చేరవచ్చని ఈడీ పేర్కొంది.
కేసు నేపథ్యం
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) కంపెనీలు సేకరించిన ప్రజా నిధులను అక్రమంగా వాడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. 2017–19 మధ్య యెస్ బ్యాంక్ ఈ కంపెనీల్లో సుమారు రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టగా, 2019 నాటికి అవి విలువ కోల్పోయాయి. ఆ నిధులను గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు రుణాల రూపంలో మళ్లించినట్లు ఈడీ నిర్ధారించింది.
దర్యాప్తు కొనసాగుతోంది
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మరియు అనుబంధ సంస్థలు బ్యాంకులను మోసం చేసిన కేసు దర్యాప్తు వేగవంతం అవుతోంది. ఈ కంపెనీలు రూ.13,600 కోట్లను గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ తెలిపింది. మొత్తం రూ.17,000 కోట్ల నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీని ఆగస్టులో విచారించారు.
విదేశీ నిధుల మళ్లింపు
రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీపై ఫెమా కింద జరిగిన వేరే దర్యాప్తులో జయపుర–రీంగస్ హైవే ప్రాజెక్ట్ నుంచి రూ.40 కోట్లు మళ్లించినట్లు ఈడీ తెలిపింది. సూరత్‌లోని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్‌కు డబ్బు తరలించారని, హవాలా మార్గంలో రూ.600 కోట్ల వరకు పంపినట్లు తేలిందని పేర్కొంది.
2010–12 మధ్య ఆర్‌కామ్ మరియు దాని గ్రూప్ కంపెనీలు భారతీయ బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకున్నాయని, ప్రస్తుతం రూ.19,694 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయని ఈడీ వెల్లడించింది. ఈ రుణాలను బ్యాంకులు ఇప్పటికే “ఫ్రాడ్”గా వర్గీకరించాయి.




















