హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం ప్రకారం, బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరుకు బయలుదేరి చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపానికి చేరుకున్నప్పుడు పొగలు రావడం గమనించిన సిబ్బంది ప్రయాణికులను వెంటనే కిందకు దించారు. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు అందరూ సురక్షితంగా బయటపడగా, అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.




















