భాగ్యనగర సిగలో మరో చరిత్రాత్మక నిర్మాణం చేరబోతోంది. నగరవాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘మీరాలం ఐకానిక్ బ్రిడ్జి’ నిర్మాణం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ KNR ఈ వంతెనను రూ.319.24 కోట్లతో నిర్మించడానికి టెండర్ సొంతం చేసుకుంది. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. క్షేత్రస్థాయిలో ఎంఆర్‌డీసీఎల్ ఇంజినీర్లు ఇప్పటికే మట్టి పనులు ప్రారంభించారు. గుత్తేదారు సంస్థ రంగంలోకి దిగి, రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు.
జాతీయ రహదారి నుంచి సంబంధం: నిజాం సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన మీర్ ఆలం బహదూర్ పేరు మీద 1806లో ఈ చెరువు నిర్మించబడింది. ప్రస్తుతం 450 ఎకరాల విస్తీర్ణంలో తటాకం విస్తరించి ఉంది. చెరువుకు జూపార్కు వైపున, మరోవైపు బెంగళూరు జాతీయ రహదారి ఉన్నందున, నాలుగు వరుసల రోడ్లతో ఆకర్షణీయమైన వంతెన నిర్మించి పర్యాటకాభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు జాతీయ రహదారిని చింతల్‌మెంట్ ప్రాంతంతో అనుసంధానించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను కూడా తగ్గించగలమని భావిస్తున్నారు.
వంతెన వివరాలు:
- పొడవు: 2.5 కి.మీ
- వెడల్పు: 16.5 మీటర్లు (నాలుగు వరుసల రోడ్, చివరలో విశాలమైన కాలిబాట)
- స్థానం: చెరువుకు పశ్చిమ వైపున చింతల్‌మెంట్, తూర్పు వైపున శాస్త్రిపురం నుండి సాగిన బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ ఐకానిక్ వంతెన నిర్మణం జరుగుతుంది.




















