ఖాకీ వేసుకున్న పోలీసుల్లాగే, బెల్ట్ కట్టుకున్న పోలీసు జాగిలాలు కూడా సమానమైన కట్టుదిట్టమైన సేవలు అందిస్తాయి. నేరపరిశోధనలో వీటి పాత్ర ఎంతో కీలకం. దొంగతనాలు, హత్యల వంటి కేసుల్లో నిందితుల జాడ కోసం ట్రాకర్ డాగ్స్, బాంబులు–పేలుడు పదార్థాలను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్, మాదకద్రవ్యాలను కనిపెట్టేందుకు డ్యూయల్ ట్రేడ్ డాగ్స్‌ను ఉపయోగిస్తున్నారు. జిల్లాలో గంజాయి పట్టివేతలో రాక్సీ ఎంతో ప్రధానంగా పనిచేస్తోంది. సింధు, చీతా స్నిఫింగ్ డాగ్స్‌గా, జాకీ, రాజాలు ట్రాకర్ డాగ్స్‌గా సేవలందిస్తున్నాయి. ఇవన్నీ బెల్జియం మెలినాయిస్, జర్మన్ షెఫర్డ్, లాబ్రడార్ రిట్రీవర్ జాతులకు చెందినవే.
పది నెలల పాటు హ్యాండ్లర్లతో కఠినమైన శిక్షణ పొందిన తర్వాతే ఇవి డ్యూటీలోకి వస్తాయి. తొమ్మిది నుంచి పదకొండేళ్ల వరకూ వీటి సేవా కాలం ఉంటుంది. అలాగే ఆరు నెలలకొకసారి వైద్యపరీక్షలు నిర్వహించి ఫిట్‌గా ఉన్నప్పుడే విధుల్లో కొనసాగిస్తారు. హ్యాండ్లర్ బెల్ట్ కట్టితేనే ఇవి డ్యూటీ ప్రారంభించినట్టే. హ్యాండ్లర్ ఆదేశాలకే పూర్తిగా కట్టుబడి పనిచేస్తాయి. కూలర్లు, ప్రత్యేక ఆహారం వంటి అన్ని సౌకర్యాలు పోలీసు శాఖే అందిస్తుంది. ఉద్యోగ విరమణ అనంతరం చివరి శ్వాస వరకు బాధ్యత కూడా పోలీసులదే. అంతేకాదు, ఇవి మరణించినప్పుడు పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం వీటికి లభించే గౌరవానికి నిదర్శనం.


















