విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పష్టమైన పురోగతిని సాధించలేకపోయిందని విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో గణాంకాల ద్వారా బయటపడింది.
2018–19లో సుమారు 3,500 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చినప్పటికీ, 2019–20 నాటికి అది కేవలం 1,000 మిలియన్ డాలర్లకు పడిపోయిందని వివరించారు.
సదస్సులో భాగంగా రెండో హాల్‌లో శుక్రవారం జరిగిన ‘‘భారతదేశం–జపాన్ విధానం’’ పై ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంతో నిర్వహించిన చర్చల్లో జపాన్ బాహ్య వాణిజ్య సంస్థ (జెట్రో) చెన్నై డైరెక్టర్ జనరల్ కౌరు షిరైషి మాట్లాడుతూ—గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో దాదాపు నిలకడగా ఉండగా, తమిళనాడు మాత్రం గణనీయమైన వృద్ధిని సాధించిందని తెలిపారు.
తద్వారా 80% జపాన్ కంపెనీలు ఏపీలోని శ్రీసిటీ ప్రాంతంలోనే పనిచేస్తున్నాయన్నారు. విదేశీ పెట్టుబడులను రప్పించాలంటే—
- సకాలంలో ప్రోత్సాహకాలు,
- బలమైన మౌలిక వసతులు,
- స్థిరమైన ఉద్యోగావకాశాలు,
- ఉద్యోగులకు క్రమబద్ధమైన ఆదాయం,
- సాంకేతికత బదిలీ వంటి అంశాలు తప్పనిసరి అని వివరించారు.
భారత పెట్టుబడి వాతావరణంలో కొన్ని సవాళ్లు, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. పన్నులు, లైసెన్సులు, అనుమతులకు ఎక్కువ సమయం తీసుకోవడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, మార్కెట్ పరిమాణం, వృద్ధి అవకాశం, తక్కువ కార్మిక వ్యయం వంటి అంశాలు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటాయని అన్నారు.




















