ముంబయి–అహ్మదాబాదు బుల్లెట్ రైలు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ అనుభవాలను సంక్షిప్తంగా నమోదు చేయాలని, తదుపరి ఇతర ప్రాజెక్టుల్లో ఉపయోగపడతాయని ప్రధాని మోదీ సూచించారు. గుజరాత్ సూరత్‌లో శనివారం ఇంజినీర్ల, నిపుణులతో కలసి ప్రాజెక్టు పురోగతి, అనుభవాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత అనుభవాలను ‘బ్లూ బుక్’ రూపంలో సిద్ధం చేస్తే దేశంలో బుల్లెట్ రైళ్ల విస్తరణకు ఉపయుక్తమని, భవిష్యత్ తరాలకు మరియు జాతి నిర్మాణానికి ఇదే ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న నమూనాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టి, అనవసర ప్రయోగాలు మానుకోవాలని, స్పష్టమైన అవగాహనతో మాత్రమే ప్రాజెక్టులు చేపట్టాలని హెచ్చరించారు. ఇంజినీర్ల ప్రకారం ప్రాజెక్టు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతుందని ప్రకటించారు.




















