విశాఖ మద్దిలపాలెంలో కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఎగసిపడ్డ మంటల కారణంగా రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి, మరో రెండు కార్లు పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మద్దిలపాలెం నుంచి ఇసుకతోటకు వెళ్లే జాతీయ రహదారి సమీపంలోని వంశీ ఫంక్షన్ హాల్ కింద ఈ షోరూమ్ ఉండగా, ఐదంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మధురవాడలో మరో అగ్నిప్రమాదం
విశాఖ మధురవాడలోని దేవిమెట్ట ప్రాంతంలో ఉన్న ఒక తుక్కు దుకాణంలో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు మంటలు అంటుకోవడంతో అగ్ని తీవ్రత పెరిగి, పరిసరాలు దట్టమైన పొగమంచుతో కప్పిపోయాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పీఎం పాలెం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల నిజమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ తుక్కు దుకాణాన్ని మధురవాడ ప్రియదర్శినికాలనీకి చెందిన శామ్యూల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం.


















