మాతృభాషను మరుస్తున్న మనకు ఆదర్శం: పల్నాడు కలెక్టర్ తెలుగు భాషాభిమానాన్ని కొనియాడిన పవన్ కళ్యాణ్!
పల్నాడు కలెక్టర్ డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు భాషపై ఆమెకున్న అభిమానం, నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… కృతికా శుక్లాజీ తెలుగు మాట్లాడుతుంటే, “మీరు ఇక్కడే పుట్టారా?” అని తాను అడిగానని తెలిపారు. “పక్క గుంటూరు-విజయవాడ ప్రాంతం వారేమో అనుకున్నాను, కానీ ఆమె ‘లేదు, లేదు… మాది హర్యానా’ అని చెప్పారు” అని తెలిపారు.
మన మాతృభాషను నేర్చుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంటే, హర్యానా నుంచి వచ్చినప్పటికీ, ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు భాష పట్ల ఆమె చూపిన అభిమానానికి మరియు పిల్లలకు భాషను అర్థమయ్యేలా వివరించడానికి ఆమె పడుతున్న శ్రమకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇతర ప్రాంతాల వారికి మన మాతృభాషపై ఉన్న గౌరవంపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.




















