నేటి విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనలు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఒక నిగూఢమైన శక్తి దాగి ఉంటుంది, దాన్ని వెలికితీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం)కు పవన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమావేశానికి ముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో మెలకువగా సంభాషించారు .
చదువునే నిజమైన శక్తి అని, లక్షలాది మనసులను కదలించే సామర్థ్యం కేవలం విద్య ద్వారా సాధ్యమని ఆయన చెప్పారు. గురువులను దైవంగా భావించే మన సంస్కృతి ప్రకారం, పిల్లల జీవితాలపై ఉపాధ్యాయుల ప్రభావం చాలా గొప్పదని ఆయన గుర్తుచేశారు.
పాఠశాలలో సరైన గ్రంథాలయం మరియు కంప్యూటర్ ల్యాబ్ లేని విషయం తెలుసుకున్న పవన్, పూర్తి గ్రంథాలయం ఏర్పాటు చేయడం, 25 కంప్యూటర్లను తన ఖర్చుతో సమకూర్చుతానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆడుకునే సరైన స్థలం లేనందుకు ఆవేదన వ్యక్తం చేసినపుడు, విద్యాశాఖ అధికారులు తగిన స్థలాన్ని చూసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఒకప్పుడు నాయకులు పాఠశాలల కోసం భూములు సమకూర్చేవారని, ఇప్పుడు భూములు లభించకపోవడం వల్లే క్రీడా మైదానాలు లేకుండా పోయాయని పవన్ వ్యాఖ్యానించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, గత ప్రభుత్వంలో ఇలాంటి సమావేశాలు జరగలేదని, 1998లో పవన్‌తో సినిమా చేయాలనుకున్నప్పటికీ రాజకీయాల్లోకి రావడంతో అది సాధ్యం కాలేదని గుర్తుచేశారు.




















