భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారికి హైదరాబాద్‌కు చెందిన శంకర్‌నారాయణ–రాజ్యలక్ష్మి దంపతులు రూ.40 లక్షల విలువైన వెండి గజవాహనాన్ని రెండు రోజుల క్రితం భక్తిశ్రద్ధలతో సమర్పించారు. సీతాదేవి ఊరేగింపునకు ప్రత్యేకంగా దానం చేసిన ఈ వాహనాన్ని ఆలయ ఈఓ దామోదర్‌రావు, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, పీఆర్వో సాయిబాబా సోమవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.
నిపుణులు ముందుగా 80 కిలోల నాణ్యమైన టేకు చెక్కతో ఏనుగు ఆకారాన్ని తయారు చేసి, దానిపై 31 కిలోల వెండి కవచాన్ని అద్దారు. తొండం, కొమ్ములు, కళ్లూ, చెవులూ, పాదాలు ఇలా ప్రతి భాగాన్ని ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.
ఇప్పటివరకు ప్రధాన ఉత్సవాల్లో రాములవారిని భక్త రామదాసు రూపొందించిన వాహనాలపై ఊరేగింపునకు తీసుకెళ్లేవారు. సీతమ్మవారికీ ప్రత్యేక వాహనాలు ఉన్నప్పటికీ, శోభాయాత్రలో భక్తులకు పూర్తిస్థాయిలో దర్శనమివ్వడం కష్టంగా ఉండేది. తాజాగా సమర్పించిన ఈ గజవాహనం ఆ లోటును తీర్చనుందని, సీతాదేవి మరింత దివ్యమైన రూపంలో దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.


















