అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో రూ.200 కోట్ల విలువైన 33 ఎకరాల భూవివాదం మళ్లీ ఉద్రిక్తమైంది. భోగాపురం స్థానికుడు పైలా అప్పలస్వామి, విశాఖకు చెందిన పీఆర్ఎస్ నాయుడు వర్గాలు కోర్టులు–యలమంచిలి స్థానిక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కేసులు నడిపినప్పటికీ వివాదానికి తుదిపరిష్కారం రావడం లేదు. తాజాగా ఇరు వర్గాలూ మధ్యస్థాయి ఒప్పందంతో భూమి పంపిణీ చేసుకున్నారు: 33 ఎకరాల్లో 22 ఎకరాలు పీఆర్ఎస్ నాయుడు పేరుతో, 11 ఎకరాలు విజయనగరానికి చెందిన రమణబాబు పేరుతో రిజిస్ట్ర్ అయ్యాయి.
అయితే, కొంత భూమిలో భవనం నిర్మించడానికి రెండు వర్గాలూ గోడలు వేసారు. రమణబాబు తన భూమిని ఆక్రమించి భవనాలు కట్టే ప్రయత్నం జరుగుతుందని ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు ఎవరూ ప్రవేశించకూడదని ఆదేశించారు. అయినప్పటికీ బుధవారం అర్ధరాత్రి 50 మందికి పైగా యువకులు ఆటోలు, జీసీబీలతో వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటిని, కొబ్బరి మొక్కలు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అలాగే, కాపలాగా ఉన్న నలుగురిని చంపుతామని బెదిరించి వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘట్టం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో చోటుచేసుకొని స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.



















