అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా సమీక్ష జరిపారని, కేంద్రం నుండి కూడా నిరంతర పరిశీలన కొనసాగిందని ఆయన వెల్లడించారు.
మాధవ్ మీడియాతో మాట్లాడుతూ – “మొంథా తుఫాన్ రాష్ట్రవ్యాప్తంగా పంటలకు భారీ నష్టం కలిగించింది. నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. తుఫాన్ ప్రభావితుల జాబితాను సేకరించి ప్రభుత్వానికి అందజేస్తాం,” అని తెలిపారు.
తిరుమలలో గత ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. “శ్రీవాణి, పరకామణి వంటి అంశాలతో పాటు అనేక విషయాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయన్న సమాచారం ఉంది. భవిష్యత్తులో తిరుమలలో ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి,” అని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.
మొంథా తుఫాన్‌పై సమర్థ ప్రతిస్పందన – తిరుమలలో పారదర్శకతకు భాజపా వంతు కృషి!




















