మొంథా తుపాను (Cyclone Montha) బలాన్ని పెంచుకుంటూ కాకినాడ తీరం వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల (ఫ్లాష్ ఫ్లడ్స్) ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణశాఖ తాజా అంచనాల ప్రకారం, రేపు ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, అలాగే ఒడిశా రాష్ట్రంలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మొంథా తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, విశాఖపట్నం నుంచి దక్షిణంగా 280 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 190 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 110 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది.
గడచిన ఆరు గంటల్లో తుపాను గంటకు 15 కి.మీ వేగంతో కదిలిందని, ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ కాకినాడ సమీప తీరంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
వాతావరణశాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, తుపాను ప్రభావం అధికంగా ఉండే తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



















