దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు, అప్పటి సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీకి పాక్ నుంచి ఉగ్ర సంస్థలు బాంబు తయారీ శిక్షణ కోసం వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను అతడికి పంపినట్లు సమాచారం. మొత్తం 42 వీడియోలు అందినట్లు అధికారులు తెలిపారు.
నిందితులు ఉగ్ర కుట్రలను టెలిగ్రామ్ యాప్‌లో చర్చించేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను కోడ్‌గా వాడినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ, ఉగ్ర కార్యకలాపాలకు దావత్ అనే కోడ్ నేమ్‌లు ఉపయోగించేవారని గుర్తించామని అధికారులు తెలిపారు.
అక్టోబర్‌లో జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్‌లో జైషే మహమ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్ర కుట్రలపై దర్యాప్తు ప్రారంభమైంది. పోస్టర్లపై ‘కమాండర్ హంజుల్లా భాయ్’ అనే పేరు ఉండేది. పాక్ హ్యాండ్లర్ హంజుల్లా, జమ్మూకశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా ఉగ్ర నెట్‌వర్క్‌లోని ముజమ్మిల్ షకీల్‌తో టచ్‌లోకి వచ్చారు. షకీల్ ఉమర్ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదంలో ప్రోత్సహించి *‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’*ను ఏర్పాటు చేశాడు. మిగతా వైద్యులకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. దిల్లీ పేలుడుకు ఉపయోగించిన కారును కూడా షకీల్ ఉమర్‌కు అందించినట్లు తెలిపారు.
దర్యాప్తు ద్వారా తెలుస్తున్నది, ఈ గుంపు దిల్లీలో ఉగ్ర దాడులు నిర్వహించడానికి కొన్నేళ్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. 2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటనలో ఉన్నప్పుడు పాక్ హ్యాండ్లర్ వారికి సిరియా ఆపరేటివ్‌తో సమావేశం ఏర్పాటు చేశాడు. ఇందులో వారు బాంబుల తయారీ మరియు ఉగ్రదాడుల ప్రణాళికలపై చర్చలు జరిపారు. వైట్ కాలర్ టెర్రర్ బృందం దిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి హై-ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 200 శక్తివంతమైన IEDs సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దాడుల కోసం ఉపయోగించిన కారుతో పాటు మరో రెండు కార్లను కొనుగోలు చేసినట్లు కూడా వెల్లడైంది.
ఇక అల్లేక్సన్ వైద్యులతో సంబంధం ఉన్న అల్-ఫలా విశ్వవిద్యాలయంపై ఫరీదాబాద్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేసి, విస్తృత దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.




















