వాళ్లందరికీ విజయం దక్కుతుంది – జమ్మి పూజలో ఈ మంత్రం పఠిస్తే చాలు!
Vijaya Dasami muhurtham : రేపే విజయదశమి. నవ రాత్రి ఉత్సవాలు ముగియడంతో దసరా పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే ఈ రోజున దుర్గాదేవి ఆశీస్సుల కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జమ్మి చెట్టుకు సైతం పూజ చేస్తారు. దీంతోపాటుగా కొత్త పనులు చేపట్టాలనుకునేవారు విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజునే ఆరంభిస్తారు.
అయితే, విజయదశమి రోజు మొత్తం మంచిదే అయినప్పటికీ, అందులో ప్రత్యేకమైన విజయ ముహూర్తం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దాన్ని విజయ ముహూర్తంగా పిలుస్తారట. రాహుకాలం, దుర్ముహూర్తాలతో సంబంధం లేకుండా.. ఆ ప్రత్యేక ముహూర్తంలో ఎవరు ఏ పనిచేసినా విజయం సిద్ధిస్తుందని చెబుతున్నారు. ఈ ముహూర్తం గురించి పరమ శివుడు పార్వతీ దేవికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది. మరి, ఇంతకీ ఈ ఏడాది దసరా రోజున ఆ ముహూర్తం ఎప్పుడు వచ్చింది? ఎంత సేపు ఉంటుంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆ ముహూర్త సమయం ఇదే :
2025లో అక్టోబర్ 2న విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 09 నిమిషాలకు ఆరంభమవుతుందని జ్యోతిష్యుడు మాచిరాజు చెబుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల 56 నిమిషాల వరకు ఈ విజయముహూర్తం ఉంటుందట. ఈ 47 నిమిషాల కాలం అందుబాటులో ఉండే ఈ ముహూర్తం ఎంతో బలమైనదని చెబుతున్నారు. ఎంతో శక్తివంతమైన ఈ ముహూర్త బలం ఏడాదిపాటు కొనసాగుతుందని, ఈ సమయంలో ఏ వ్యాపారం ప్రారంభించినా, ఏ పని మొదలు పెట్టిన అద్భుతమైన విజయం దక్కుతుందని అంటున్నారు.
ఈ ముహూర్తంలో ఉద్యోగంలో చేరితే అత్యున్నత స్థాయికి ఎదుగుతారట. విదేశీ యానం చేస్తే ఎంతో మంచిదని, అక్కడ విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఈ విదంగా జీవితానికి సంబంధించిన ఏ పని చేసినా కూడా గెలుపు దక్కుతుందని చెబుతున్నారు.
















