హరిహరసుతనే… శరణమయ్యప్ప… ఆపద్బాంధవనే… శరణమయ్యప్ప… అంటూ మాలధారుల శరణుఘోషలతో ద్వారపూడి అయ్యప్ప దేవాలయం దీపాల వెలుగుతో అల్లుకున్నట్లయింది. దేశంలో ప్రసిద్ధి గాంచిన శబరిమల క్షేత్రానికి భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు తరలుతారు. అయితే, అక్కడకు వెళ్ళలేని భక్తులు మండపేట మండలంలోని ద్వారపూడి అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ఇరుముడులు సమర్పిస్తారు.
ఆంధ్రా శబరిమల:
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రాకతో ఈ ఆలయం ఆంధ్రా శబరిమలా ప్రసిద్ధి చెందింది. ఏకశిలతో చెక్కిన పవిత్రమైన 18 మెట్లు ఆలయానికి ప్రత్యేకతను అందిస్తాయి. ద్వారపూడి వ్యాపారి ఎస్.ఎల్. కనకరాజు గురుస్వామి 1983లో భూమిపూజ నిర్వహించి, విరాళాల ద్వారా ఆలయ నిర్మాణానికి పునాదులు వేసారు. 1989లో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి చేతులమీదుగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటినుంచి నిత్యం అర్చన, ప్రత్యేక పూజలు, నెయ్యి అభిషేకం, ఇరుముడి సమర్పణ కొనసాగుతున్నాయి. దర్శనం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు అనుమతించబడుతుంది.
రోజుకు వేలాది భక్తులు:
ఆయప్ప దీక్షలు కార్తికమాసం నుండి మకరసంక్రాంతి వరకు 41 రోజులుగా కొనసాగుతాయి. దీక్ష పూర్తి చేసి కేరళ వెళ్లలేని భక్తులు ఇక్కడకు వచ్చి ఇరుముడులు సమర్పిస్తారు. ఆంధ్రా, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 600–2,000 భక్తులు ఇరుముడులు సమర్పిస్తారు. దర్శనం కోసం 6,000–10,000 మంది హాజరవుతారు. దాదాపు 3,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తారు, అని ఆలయ వ్యవస్థాపకుడు ఎస్.ఎల్. కనకరాజు గురుస్వామి తెలిపారు.
ప్రాంగణంలో ఆకట్టుకునే ఉపాలయాలు:
ప్రాంగణంలో దేశంలోనే రెండో అతిపెద్ద ఆదియోగి విగ్రహం భక్తులను తారసపడేలా ఆకర్షిస్తుంది. ప్రవేశంలో సుబ్రహ్మణ్య, ఆంజనేయస్వామి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ప్రాంగణంలో 10కంటే ఎక్కువ ఉపాలయాలు ఉన్నాయి. ఇందులో సాయిబాబా మందిరం, శివాలయం, దుర్గాదేవి, శ్రీపంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ శ్రీఉమాలింగేశ్వరస్వామి, భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ, పాపవిమోచన దేవాలయాలు ఉన్నాయి. దశావతరాలతో కూడిన వేంకటేశ్వరస్వామి, జగన్మాత అంకాళమ్మ, శనీశ్వరాలయం, నవగ్రహ, శ్రీలక్ష్మీకుబేర ఆలయాలు కూడా దర్శించవచ్చు. యజ్ఞయాగాలను నిర్వహించడానికి ప్రత్యేక యాగశాల ఏర్పాటుచేయబడింది.



















