ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం నమోదైంది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి రహదారులు నీటమునిగిపోయాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎనుమాముల మార్కెట్లో పత్తి, మొక్కజొన్న తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ‘మొంథా’ తుపాను కారణంగా ముంపునకు గురైన వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు ఇంకా పూర్తిగా కోలుకోకపోగా, తాజా వర్షాలతో మళ్లీ ముంపు భయం అలుముకుంది. జనగామ జిల్లాలో కూడా ఉదయం నుంచే వర్షం కొనసాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘన్పూర్, తరిగొప్పుల, నర్మెట్ల, బచ్చన్నపేట మండలాల్లో వర్షపాతం నమోదవుతోంది.




















