ఇంటర్నెట్ డెస్క్: తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్‌లో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశానికి షరతు పెట్టారు. బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగివెళ్తానని అన్నారు. అటువంటి పరిస్థితులనే అక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. పీటీఐకీ ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ.. భారత్‌తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని హసీనా ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భారత్‌తో బలమైన సంబంధాలు కొనసాగించామని.. యూనస్ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారన్నారు. కష్ట సమయంలో ఆశ్రయం కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం విఫలమయ్యిందని.. అటువంటి భయంకరమైన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్నానన్నారు. కానీ ఆ సమయంలో విద్యార్థి నాయకులు కూడా బాధ్యత తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తంచేశారు.




















