కాళిదాసు, కృష్ణశాస్త్రి లాంటి కవులు మేఘాలతో ఊసులాడితే అదేదో భావుకతగా భావించారు. కానీ నేడు ‘క్లౌడ్ కంప్యూటింగ్’ సాంకేతికత రూపుదిద్దుకుంది. వృద్ధిపథంలో లక్ష కోట్ల రూపాయల మార్కెట్ వైపు దూసుకువెళుతోంది. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే ఉద్యోగార్థుల కోసం వివిధ సాంకేతిక, సాంకేతికేతర (నాన్-టెక్నికల్) హోదాలు ఆహ్వానం పలుకుతున్నాయి!
ప్రతి పరిశ్రమలోనూ కోర్, నాన్ కోర్ పొజిషన్లు ఉంటాయి. ప్రధాన ఉత్పత్తి లేదా సర్వీసుతో నేరుగా సంబంధం ఉండే హోదాలను కోర్‌గానూ, ప్రత్యక్ష సంబంధం లేకుండా పరోక్ష సేవల కిందకు వచ్చేవి నాన్-కోర్‌గానూ చెబుతారు. క్లౌడ్ కంప్యూటింగ్ పరిశ్రమలో టెక్నికల్ పొజిషన్లన్నీ కోర్ కోవకు చెందినవే.
ఆర్కిటెక్ట్/ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్: వివిధ వ్యాపారాల్లో ఉత్పన్నమయ్యే సంక్లిష్ట సవాళ్లకు క్లౌడ్ ఆధారిత పరిష్కారాలు రూపొందించడం ఈ హోదాలో ఉండే ఉద్యోగి చేయాల్సిన ప్రధాన పని.
ఇంజినీర్: భారీ డేటా సెంటర్లలో సర్వర్లు, ఇతర మౌలిక సదుపాయాలను క్లౌడ్ ఇంజినీర్లు కల్పిస్తారు. వాటి నిర్వహణకు నిరంతరం బాధ్యత వహిస్తారు.
సెక్యూరిటీ ఇంజినీర్: క్లౌడ్ కంప్యూటింగ్ అనేదే ఒక ఐటీ ముడి సరుకు. డేటాను భద్రపరిచే సర్వర్లు, స్టోరేజి సౌకర్యం, వివిధ అవసరాలకు తక్షణం వినియోగించుకోగలిగే సాఫ్ట్‌వేర్ల్లు, బిజినెస్ అనలిటిక్స్ లాంటివి క్లౌడ్ కంప్యూటింగ్‌లో భాగం. ఇటువంటి మౌలిక నిర్మాణాన్ని సిద్ధం చేసుకొని అడిగినవారికి ఇచ్చే వ్యాపారం ఇది. అంటే ఈ బిజినెస్‌లో డేటాను కంటికి రెప్పలా కాపాడటమే కీలకం. ఈ బాధ్యతను క్లౌడ్ సెక్యూరిటీ ఇంజినీర్లు నిర్వహిస్తుంటారు.
నెట్‌వర్క్ ఇంజినీర్: క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌పై నెట్‌వర్క్ మౌలిక సౌకర్యాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను వీరు నిర్వర్తిస్తారు.
ఏ.ఐ., ఎం.ఎల్. ఇంజినీర్: క్లౌడ్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపకరణాల కోసం అప్లికేషన్లు రూపొందిస్తారు.
డెవలపర్: క్లౌడ్ వాతావరణంలో పనిచేసే సాఫ్ట్‌వేర్లు, వివిధ అప్లికేషన్లను వీరు సిద్ధం చేస్తారు.
సాంకేతికేతర పొజిషన్లు
క్లౌడ్ కంప్యూటింగ్‌కు పూర్తిగా టెక్నికల్ స్కిల్స్ ఆధారిత కార్యకలాపాలతో సంబంధం ఉన్నప్పటికీ అంతిమంగా ఇదీ ఒక బిజినెస్ మోడల్. ఈ రంగంలోని వ్యాపార దక్షత, పాలన సామర్థ్యం గల వారి అవసరం ఉంది. ఇటు టెక్నికల్ నాలెడ్జ్, అటు బిజినెస్ స్కిల్స్ కలబోసినవారిని హైబ్రిడ్ పొజిషన్లకు ఎంపిక చేసుకుంటున్నారు.
కన్సల్టెంట్: క్లౌడ్‌ను లాభదాయక వ్యాపారంగా నిర్వహించడం నుంచి వ్యయ నియంత్రణ, డేటా భద్రత, అవసరమైతే క్లౌడ్ ప్లాట్‌ఫామ్ బదలాయింపుపై ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తుంటారు.
ప్రాజెక్ట్ మేనేజర్: ఆలోచన నుంచి ఆచరణ వరకూ క్లౌడ్ గమనంలోని వివిధ దశలను సమర్థంగా నిర్వహిస్తారు.
అడ్మినిస్ట్రేటర్: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ చేతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులు.. సంస్థ ఆశించే ఫలితాలు రాబట్టేలా వీరు నిర్వహణ బాధ్యతలు వహిస్తారు.
కస్టమర్ సపోర్ట్: క్లౌడ్ కంపెనీ కస్టమర్లకు అవసరమైన సాంకేతిక సాధారణ సేవలను అందిస్తూ వారు సంతృప్తి చెందేలా ఈ నిపుణులు చూస్తారు.




















