దిల్లీ: త్వరలో బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ లను ప్రతిపాదించే బిల్లు ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా రంగంలోకి మరిన్ని సంస్థలను తీసుకురావడంతో పాటు.. అధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ ఎఫ్‌డీఐ ప్రతిపాదిత బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా బీమా చట్టం 1938లోని వివిధ నిబంధనలను సవరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. వాటిలో బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లను ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి చేర్చడంతో పాటు పెయిడప్ క్యాపిటల్‌ను తగ్గించడం, కాంపొజిట్ లైసెన్స్ నిబంధన వంటివి ఈ బిల్లులో ఉన్నాయన్నారు. బీమా నియంత్రణ అభివృద్ధి చట్టం 1999లోనూ సవరణలు ప్రతిపాదించినట్లు తెలిపారు.
పాలసీదారుల ప్రయోజనాలను ప్రోత్సహించడం, వారి ఆర్థిక భద్రతను పెంచడం, బీమా మార్కెట్‌లోకి మరిన్ని భాగస్వామ్య సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు ప్రతిపాదిత సవరణలు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు భారత్‌లోని ప్రతి పౌరుడు సాధించిన విజయమని పేర్కొన్నారు. దీపావళి పండగకు ముందే జీఎస్టీ సంస్కరణలను ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ సంస్కరణలను ప్రజలముందుకు తీసుకువచ్చి అనేక కుటుంబాలపై భారం తగ్గించామన్నారు. ప్రజల సాధికారత ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు.




















