యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురంలో తయారవుతున్న కడలుంగీలు ఇప్పుడు విదేశాలకు చేరాయి. ఇక్కడి మరమగ్గాలపై నేసే ఈ లుంగీలు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా వరకు సరఫరా అవుతున్నాయి. చివర్లను కుచ్చులుగా నేసిన లుంగీలను స్థానికంగా ‘కడలుంగీలు’ అని పిలుస్తారు. గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వ్యాపారం ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది.
రఘునాథపురంలో సుమారు 1100 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో చాలా మంది పద్మశాలి వర్గానికి చెందినవారు. మరమగ్గాలే వారి ప్రధాన జీవనాధారం. గ్రామంలో సుమారు 800 మగ్గాలు ఉండగా, వాటిలో 400కి పైగా మగ్గాలపై కికాయ్ (ఉగాండా లుంగీలు), జనానీలు, అక్రిలిక్, కడలుంగీలు వంటి వస్త్రాలు నేస్తున్నారు. ఒక కడలుంగీ తయారయ్యే ప్రక్రియలో మాస్టర్ వీవర్లు, వీవర్లు, ఇతర నైపుణ్య కార్మికులు కలిసి దాదాపు ఆరు దశల్లో పనిచేస్తారు.
రోజూ సుమారు 2 వేల లుంగీలు తయారవుతుండటంతో వారానికి ఒకసారి సరఫరా చేస్తుంటారు. ఈ లుంగీలు మొదట హైదరాబాద్ మార్కెట్లో అమ్మబడేవి. తరువాత ముంబయి వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి ఉగాండా, దుబాయ్‌లకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అక్కడి నుంచే నేరుగా ఆర్డర్లు వస్తుండటంతో ఈ వ్యాపారం నిరంతరంగా కొనసాగుతోంది.
రఘునాథపురంలో తయారవుతున్న కడలుంగీలకు ఉగాండా మహిళలలో మంచి డిమాండ్ ఉందని, ఈ వ్యాపారంతో గ్రామంలో వందలాది మందికి ఉపాధి లభిస్తున్నదని మాస్టర్ వీవర్ కటకం వెంకటేశం తెలిపారు.


















