కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన తల్లి, కుమారుడు కనిపించడం లేదని సమాచారం. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలో నివసించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాము బంధువులు పిలోమి నాన్ బేబీ (64), కిషోర్ కుమార్ (41) ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా పటాన్‌చెరుకు వచ్చారు.
గురువారం సాయంత్రం వారు పటాన్‌చెరు అంబేడ్కర్ కూడలి వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. అయితే మధ్యలో చిన్నటేకూరు వద్ద జరిగిన దారుణ ప్రమాదం తర్వాత ఈ తల్లీకుమారుల ఆచూకీ తెలియడం లేదు. వారి సురక్షిత పరిస్థితి గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని కనుగొనడానికి రాము దంపతులు కర్నూలుకు వెళ్లి అన్వేషణ ప్రారంభించారు.
			
                                







							











