ఈ మధ్యకాలంలో భాషాశాస్త్రవేత్తలు కొంతమంది తమ పరిశోధనలద్వారా తేల్చిన విషయమేమిటంటే –
“అత్యాధునిక సాంకేతిక యుగప్రభావం వల్ల క్రమంగా దేశభాషలు నశించిపోయే అవకాశముంది.
కేవలం ఇంగ్లీష్… అదీ వ్యాపార-వాణిజ్య-వృత్తి సమాచారాలకు పరిమితమైన విధంగా మాధ్యమ భాషగా ఉండడం చేత కాలక్రమేణా ఇతర భాషలు అంతరించవచ్చు” అని చెప్పడమే కాక, “ప్రత్యేకించి వేగంగా అంతరించి పోయేది తెలుగు భాషే”ననికూడా సూచించారు.
ఒక గొప్ప సంస్కృతిని దెబ్బతీయాలంటే, దాని భాషను నశింపజేస్తే చాలు. భాషను విస్మరిస్తే తరతరాల సంస్కృతి విస్మృతి అవుతుంది.
ఇటీవల ఆంధ్రదేశపు నడిబొడ్డున ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతడు ప్రభుత్వద్యోగి. అతడి కుమారుడు ఓ ఇరవై ఏళ్ళ వాడు “అంకుల్ నేను వేదాలు స్టడీ చేయాలనుకుంటున్నాను. సంస్కృతం నేర్చుకోవాలంటే ఎలా?” అని అడిగాడు.
“నీకు తెలుగు వచ్చా?” అని అడిగితే, “ఏదో ఇలా మాట్లాడతాను. అయితే చదవడం, రాయడం రాదు” అని జవాబిచ్చాడు. అతడి తండ్రి కూడా ఆ విషయం ఘనంగా చెప్పాడు. మాట్లాడే తెలుగు కూడా ‘కూడబలుక్కుని’ ఉంది.
ఇప్పటి మధ్యతరగతి కుటుంబాల యువతరంలో అత్యధిక భాగానికి తెలుగు వ్రాయడం, చదవడం రాదు. ఏదో సినిమాల, టీవీల ధర్మమా అని వచ్చీ రాని సంభాషణ మాత్రం మిగిలింది.
అదీ ‘ఎన్నో అందమైన పలుకుబళ్ళు’ కోల్పోయిన తెలుగు.
ఒక భాష ఒక జాతి సంస్కారానికి ప్రతీక. పైగా మన దేశభాషలు అన్నీ ఒక మహాసంస్కృతికి సంబంధించిన గొప్ప వాఙ్మయాలను నిర్మించుకున్నాయి.
ఆ సాహిత్యం ‘కూడు పెడుతుందా?’ అని దానిని పూర్తిగా పోగొట్టుకున్నాం. మన లక్ష్యాలు సంపాదన, వినోదాలుగా నిలచి ఒక అర్థం లేని పరుగులు పెట్టిస్తున్నాయి.
ఆ పరుగులో ఆత్మనీ, బుద్ధినీ పట్టించుకోని పాశవిక జీవనవిధానం అలవరుచుకుంటున్నాం.
కానీ ఎప్పుడైనా రానున్న తరాలలో ఆసక్తి రగిలి, మన సనాతనత్వం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినా అప్పటికి వీటి ఆనవాళ్ళు కూడా మనం మిగుల్చుతామో, లేదో! ఇందులో పెద్దల అశ్రద్ధ చాలా ఉంది.
భాష దాని సహజమైన రీతిలో, పలుకుబళ్ళతో సహా బ్రతికినప్పుడే ఆ భాష లోని కమ్మదనం, గొప్పదనం తెలుస్తుంది. ఏదో మొక్కుబడిగా అక్షరాలు నేర్చుకొని, కూడ బలుక్కొని ‘చదివేశాం’ అనిపించుకుంటే చాలదు. భాషతో బ్రతకడం అలవరచుకుంటేనే ఆ భాష యొక్క ఆత్మను ఆవిష్కరించుకోగలం.
ఒక భాషలో పుట్టిన సాహిత్యాన్ని మరో భాషలోకి అనువదించి చదివినా ‘అసలు హృదయం’ అందడం మాత్రం సాధ్యం కాదు. ఆ పలుకుబళ్ళలో, జాతీయాలలో ఉండే సొగసు మరో భాషలోకి ఒదగడం కష్టం.
అవన్నీ మరచిపోతే వాటిలోని సౌందర్యాన్ని ఆస్వాదించడమే మృగ్యమైపోతుంది.
చివరికి వేమన శతకాన్నీ, సుమతీ శతకాన్నీ సైతం ఇంగ్లీషు అనువాదాలలోనే చదువుకోవలసిన దౌర్భాగ్యస్థితి దాపురించింది.
భాషాప్రవాహం అనేక మార్పులతో కొనసాగడం నైజం. అంతేగానీ, అది ఎండిపోవడం మాత్రం అవాంఛనీయం.
గత శతాబ్దపు కొత్త ఉద్యమాలు ప్రాచీన సాహిత్య ప్రక్రియల్ని ఎండగట్టడానికే కంకణం కట్టుకొని, ఎన్నో అందమైన సాహిత్యనిధుల్ని మిగలకుండా చేశాయి.
ఇక విద్యాలయాలలోనూ దేశభాషలు బ్రతికే భాగ్యం కనబడడం లేదు. కొన్ని విద్యాలయాల్లో తెలుగులో మాట్లాడితే జరిమానా విధించడమో, టీసీ ఇచ్చి పంపించడమో కూడా చేస్తున్నారు. ఇలా పనిబూని భాషానాశనం చేయడాన్ని ఏ ఒక్కరూ నిరసించడానికి కూడా ముందుకు రావడం లేదు.
ఉన్న తెలుగువాచకాలలో కూడా మునుపటి ప్రామాణికత లేదని వాటి భాషామాధురి తెలిసినవారంతా అంగీకరిస్తున్నారు. ‘అందరికీ అర్థం కావాలి’ అనే నినాదంతో చౌకబారు తెలుగును కూడా వాడకాలలో ఉపయోగిస్తున్నారు.
అలాంటి భాషను వాడాల్సిన అవసరం పత్రికలకు ఉంటుందేమో కానీ, వాచకాలకు అనవసరం. భాషాపుష్టి పెంచడానికి ఈ వాచకాలు, ఉపాధ్యాయులు ఉపకరించాలేగానీ, భాషను పలచబరచడానికి కాదు.
నన్నయ్య, తిక్కన, పోతన, శ్రీనాథ, అన్నమయ్య, త్యాగయ్య… వీరందరి పేర్లు కూడా మరచిపోయే కాలం ప్రత్యక్షం కానుంది. ఏనాడో వారి వాఙ్మయాన్ని వదిలేశాం. పేర్లు మాత్రం ఇంకా మిగిలిన ఆ తరంవారు గుర్తుపెట్టుకున్నారు. అవీ వారితో పాటూ తరలిపోతాయి. ‘పోతే నష్టమేముంది!’ అని కేవల ఆర్థిక లక్ష్యాలతో బ్రతుకుతున్న నేటి సమాజం నిర్లక్ష్యం – తాను ఏ పునాదిని చేజేతులా కోల్పోతుందో గమనించడం లేదు.
మహాదౌర్భాగ్యమేమిటంటే – ఇంత దుస్థితి తెలుగుభాషకే పట్టింది. ఇతర దేశభాషలలో పెద్దతరం తమ తరువాతి తరాల వారికి చాలా జాగ్రత్తగా భాషాసంస్కారాన్ని అలవరచడంలో శ్రద్ధ తీసుకుంటోంది.
తమిళ, కన్నడ, మళయాళ, బెంగాలీ, హిందీ… ఈ భాషలన్నీ తమ వాఙ్మయంలోని గొప్ప గ్రంథాలను తరతరాలకు కొనసాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడి ప్రభుత్వాలూ అందుకు ఉద్యమిస్తున్నాయి.
‘తేటతెలుగు’, ‘తీపితెలుగు’ – అనిపించుకున్న మన భాషలోనే ఈ వికృతి ధోరణి బలపడుతుండడం విచారకరం.
ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో తెలుగువారు తెలుగును పట్టించుకోవడం లేదు – అని ఆలోచించనవసరం లేదు. తెలుగునేలపైనే తెలుగుకి సహజమైన మనుగడ కరువవుతోంది.
తల్లి భాషను పలికించి, ఆ భాషతో బ్రతికించడంలో ప్రధాన బాధ్యత ప్రతి తల్లీ తీసుకోవడం ఇప్పుడు తక్షణ కర్తవ్యం.
మన ఇళ్లే మన సంస్కృతికి, మన భాషకు రక్షణకేంద్రాలు కావాలి.




















