బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు జరిపారు. బ్రిస్బేన్లోని జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాపికల్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ (CSTFA) విభాగానికి చెందిన ప్రొఫెసర్ క్యాల్ జెంజర్తో ఆయన సమావేశమయ్యారు.
ప్రొఫెసర్ జెంజర్ ఉష్ణమండల ఆక్వాసాగు పరిశోధనల్లో నిపుణుడు కాగా, బ్లాక్ టైగర్ మరియు బారాముండి రొయ్యల జన్యు మెరుగుదలపై కీలక పరిశోధనలు చేపట్టారు. ఆయన బృందం ఆక్వాసాగు సామర్థ్యాన్ని పెంచే జెనెటిక్ సాధనాల అభివృద్ధిపై కృషి చేస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రొయ్యలు, చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్నందున, CSTFA నైపుణ్యంతో ఆక్వాకల్చర్ జెనెటిక్స్ రంగంలో సహకారం అందించాలని కోరారు. బ్లాక్ టైగర్ రొయ్యల వ్యాధి నిరోధకత, వృద్ధిరేటు మెరుగుదల కోసం జెనెటిక్ పరిశోధనలు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
అలాగే, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు వాటర్ రీసైక్లింగ్ మరియు ఫీడ్ ఆప్టిమైజేషన్ సాంకేతికతలను ప్రోత్సహించాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, స్థిరమైన నిర్వహణ, జన్యు ఎంపికపై శిక్షణా కార్యక్రమాలు అందించాలన్నారు.
ఆక్వాసాగులో నష్టాలను తగ్గించి ఉత్పత్తి స్థిరీకరణకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేయడం అత్యవసరం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం కొత్త స్థాయికి ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






















