అమరావతి: రాష్ట్రంలో వాయుగుండం, ఈదురుగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.
హోంమంత్రి అనిత తెలిపిన ప్రకారం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
అలాగే, వాతావరణ మార్పులు, హెచ్చరికలపై ప్రజలకు సకాలంలో సందేశాలు పంపాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101 లను అందుబాటులో ఉంచినట్టు హోంమంత్రి తెలిపారు.
ఆమె స్పష్టం చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ముందస్తు చర్యలు తీసుకుంటుందని, ఏ పరిస్థితినీ నిర్లక్ష్యం చేయరాదని పేర్కొన్నారు.



















