మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ భూ కుంభకోణం కేసు రాజకీయ ఉత్కంఠకు కారణంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆరోపణల ప్రకారం, రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3 కోట్లకు దక్కించుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రతాప్ సర్‌నాయక్ భయందర్‌లో సుమారు రూ.200 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసి అక్కడ ఒక విద్యాసంస్థ ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంపై మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పందిస్తూ, దీనిపై ఇప్పటివరకు ఎవరినుంచి ఫిర్యాదు అందలేదని, మీడియా ద్వారా ఆరోపణలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇదే తరహాలో, ప్రతిపక్షాలు అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.18,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.300 కోట్లకే విక్రయించారని కూడా ఆరోపించాయి . ఈ కేసును గంభీరంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం బృందాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రతాప్ సర్‌నాయక్‌పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.




















