రోజురోజుకూ కృత్రిమ మేధ మరింత అభివృద్ధి చెందుతోంది. అధునాతన ఏఐ మోడళ్లను రూపొందించేందుకు గూగుల్, ఓపెన్‌ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తీవ్రమైన పోటీ పడుతున్నాయి. బిలియన్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి, మనుషులు చేసే అనేక పనులను ఏఐతో చేయిస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఈ మోడళ్లకు మనుషుల మాదిరిగా ఆలోచించే సామర్థ్యం లేదు.
ఇలాంటి పరిస్థితిలో, ఏఐకి స్వంత ఆలోచనా శక్తి, అవగాహన తీసుకురావాలని ప్రయత్నిస్తున్న పరిశోధకులపై మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ (Mustafa Suleyman) కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఏఐ ఎప్పటికీ మనిషి స్థాయికి చేరుకోలేదని, చేరుకోదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన సీఎన్‌బీసీ నిర్వహించిన ఆఫ్రోటెక్ సదస్సులో చేశారు.
ఏఐకి సొంత తెలివితేటలు ఇవ్వాలని చూసే పరిశోధకులను సులేమాన్ తీవ్రంగా విమర్శించారు. నిజమైన భావోద్వేగాలు మనుషులకే ప్రత్యేకమని, వాటిని యంత్రాల్లో నాటడం అసాధ్యమని చెప్పారు. “తప్పు ప్రశ్న అడిగితే, తప్పు సమాధానం వస్తుంది. అంటే ప్రశ్నే తప్పు” అని వ్యాఖ్యానించారు.
ఏఐకి స్వతంత్ర ఆలోచనా శక్తి ఇచ్చే దిశగా కాకుండా, మనిషికి సహాయకారిగా ఉండే విధంగా కృత్రిమ మేధ అభివృద్ధి చేయాలని ఆయన డెవలపర్లకు సూచించారు.ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, మనిషి భావోద్వేగాలు మరియు ఏఐ ప్రతిస్పందనల మధ్య ఎప్పటికీ ఒక సన్నని రేఖ ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ తెలిపారు.
మనుషులు శారీరకంగా నొప్పి లేదా బాధ అనుభవించినప్పుడు లోతైన భావోద్వేగ స్పందన కలుగుతుందని, భయం లేదా వేదన వంటి అనుభూతులు నిజమైనవని చెప్పారు. కానీ, ఏఐకు అటువంటి అనుభూతులు కలగడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఏఐకి భావోద్వేగాలను కల్పించేందుకు చేసినా, అవి కేవలం ప్రదర్శన మాత్రమే అవుతాయని, నిజంగా ఆ అనుభవాన్ని పొందలేవని తెలిపారు.
ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న సంస్థలకు వేర్వేరు ఉద్దేశాలు ఉన్నప్పటికీ, అలాంటి దిశలో ప్రయాణించకపోవడమే మంచిదని సులేమాన్ సూచించారు. నిజమైన స్పృహ లేకపోవడం వల్లే ఇలాంటి అసంబద్ధ పరిశోధనలపై సమయం, వనరులు వృథా అవుతున్నాయని ఆయన విమర్శించారు.




















