పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు:
మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించి పాలకొల్లు–ఆచంట రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రోడ్లపై గుంతల కారణంగా అనేక ప్రాణాలు కోల్పోయాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టామని తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను నిర్వీర్యం చేశారని నిమ్మల ఆరోపించారు. తాము మాత్రం ఒక్క పాలకొల్లులోనే రూ.45 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ.5 వేల కోట్లను దారి మళ్లించినట్లు మాజీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
“మా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తోంది. సూపర్ సిక్స్ హామీలన్నీ ఏడాదిన్నరలోనే నెరవేర్చిన ఘనత చంద్రబాబు గారిది,” అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే ఏమిటో తెలియని కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల్లో విషప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.



















