నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాత్రి సమయానికి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తీరం వెంబడి ఉన్న 42 గ్రామాలకు హైఅలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని సూచించారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.



















