శామీర్‌పేట: మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. శామీర్‌పేట చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, “మత్స్యకారుల అభివృద్ధి, జీవనోపాధి రక్షణ నా ప్రాధాన్యత. ఈ వృత్తిపై ఆధారపడిన ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. చేపల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్ సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.
100% సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ
ఎంపీ ఈటల మాట్లాడుతూ, గతంలో అమలులో ఉన్న కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి, మత్స్యకారులకే లాభం చేకూరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 100% సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేయడం మత్స్యకారులకు పెద్ద ఊరట కలిగించిందని పేర్కొన్నారు.
మత్స్యకారుల సేవకు అంకితం
తాను గత 25 ఏళ్లుగా మత్స్యకారుల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని, భవిష్యత్తులో కూడా వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
“ఏ సమస్య వచ్చినా మత్స్యకారుల పక్షాన నేనున్నా. వారి అభివృద్ధి కోసం ప్రతి అడుగులో సహకరిస్తా” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.




















