ప్రధాని నరేంద్ర మోదీ, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు మీడియా మహనీయుడు రామోజీ రావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రారంభించడం పై ఆనందం వ్యక్తం చేశారు. భారత మీడియా, వినోద రంగాల్లో చెరగని ముద్ర వేసిన దార్శనికుడైన రామోజీ రావుకు ఇది నిజమైన, ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులను గౌరవించడం దేశానికి స్ఫూర్తిదాయకమని ప్రధాని అన్నారు. ప్రజల సేవలో నిమగ్నమైన వారిని గుర్తించి గౌరవించడం ఒక సానుకూల సంస్కృతిని పెంపొందిస్తుందని తెలిపారు.
దేశ నిర్మాణానికి అవసరమైన నిస్వార్థ సేవ, నిజాయతీ, నిబద్ధత వంటి విలువలను మరింత బలోపేతం చేసే కార్యక్రమమిదని మోదీ అభిప్రాయపడ్డారు. గత దశాబ్దంగా పద్మ అవార్డులు, మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల ద్వారా మరుగునపడ్డ మహనీయుల సేవలను వెలుగులోకి తీసుకువస్తున్నామని గుర్తుచేశారు.
దేశం 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి పౌరుడి పాలుపంచుకోవడం అత్యంత కీలకమని తెలిపారు. సమగ్ర అభివృద్ధిని సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలంటే ప్రజల సహకారం, కృషి అత్యవసరమని అన్నారు.
‘తల్లి భారత సేవలో మరింత స్ఫూర్తిని నింపాలని కోరుకుంటూ, రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందుకున్న విజేతలకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.



















