పూర్వకాలంలో అంతా రాజు గుప్పిట్లోనే పాలన ఉండేదని, ప్రజలు ఏ విధంగానూ పాలు పంచుకోలేదని చాలా మంది భావిస్తారు. రాజు అని వ్యవహరించినప్పుడు…, ఒక్క రాజే కాదు, అతని మంత్రులు, ఉన్నత అధికారులు అన్ని నిర్ణయాలను తీసుకొని అమలు పరిచేవారని భావిస్తారు. పాశ్చాత్య ప్రభావానికి లోనైన కొందరు చారిత్రక పరిశోధకులు బ్రాహ్మణులు రాజును తమ గుప్పిట్లో పెట్టుకొని నడిపించేవారని వ్రాసారు.
ప్రజాస్వామ్యం అనగా ప్రజలు కూడా భాగస్వాములై నడిపించే వ్యవస్థ గురించి పాశ్చాత్యులవల్లనే తెలిసిందనీ వ్రాస్తూ ఉంటారు.
అనాది నుండి (వేదాలలో) ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొన్నట్లు ఆధారాలున్నాయి. సభ, సమితి, విధథ అనే నిర్వాహక సంస్థలను వేదాలు పేర్కొన్నాయి. వీటిల్లో విద్వాంసులు సమావేశమై చర్చించి నిర్ణయాలను రాజునకు నివేదిస్తూ ఉండేవారు. వీరి సలహాలను అనుసరించి రాజు పరిపాలించేవాడు. ఇవి బ్రాహ్మణులు, క్షత్రియులతోనే నింపబడ్డాయని పాశ్చాత్య చరిత్రకారులూ వ్రాయలేదు. అందు సంఘంలోని వివిధ వర్ణాలకు చెందిన పెద్దలు ఉండేవారు.
యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది కదా? (తైత్తిరీయ సంహిత-నమకం) ఇందు సమస్త చరాచర వస్తు ప్రపంచానికి నమస్కరించడం ఉంటుంది. నమోనమః అనే పేరుతో. పరమాత్మ అన్నిటా ఉన్నాడని అందర్నీ పేర్కొనడం జరిగింది. ఇందు సభలకు నమస్కారం, సభాపతులు నమస్కారం అని ఉంది. పై సభయే ఈ సభ. సభను నడిపేవాడు సభాపతి.
ఈనాడు సంగీత సభలని అంటా ఉన్నారు కదా! నేను సభకు వెడుతున్నానని అనగా సంగీత కచ్చేరీకి వెడుతున్నాడని అర్ధం. కానీ వేదంలో సభ అంటే నేటి శాసన సభయే.
ఇందు ప్రముఖులుండి ప్రజల యోగక్షేమాలను విచారిస్తారు కనుక పూజ్య స్థానమైంది.
చిదంబరంలో నటరాజు కొలువుండే సభను కనక సభయని అంటారు. ఇలాంటి సభలు ఇంకా నాలుగున్నాయి. మధురైలో రజత సభ, తిరునల్వేలిలో తామ్రసభ, తిరుకుట్రాలంలో చిత్రసభ ఉన్నాయి. ఇవన్నీ శిల్ప శోభితాలు. ఇందు సభాపతి, నటరాజే.
మనం చిదంబరాన్ని నటరాజాలయం అంటాం. అక్కడున్న అర్చకులు (దీక్షితులు) దీనిని సభా నాయకర్ కోవిల్ అని అంటారు. ఈశ్వరుడు సభా నాయకుడు, లేదా సభాపతియే కాదు, ఆయనయే సభ. ఇట్టి సభకు కూడా నమస్కారమని అర్ధం చేసుకోవాలి. మన సంకల్పాలు భగవత్ సంకల్పాలనే మాట ఈనాడే పుట్టలేదు.
ఈ పై సభలలో (ప్రజల సభ) పాల్గొనేవారికి మూడు అర్హతలుండాలి. మంచి నడవడి, మంచి బుద్ధి, స్పష్టమైన ఉచ్చారణ లేదా వాఙ్నై పుణ్యము. ఇట్టి లక్షణాలు పట్టుబడాలనే ప్రార్థనతో కూడిన మంత్రాలున్నాయి. ఋషులకు మేధ, నడవడిక ఉన్నట్లు మనకు తెలుసు. ప్రజలకు సేవ చేయాలనే భావనతో ఇందు కొందరు సభలనలంకరించేవారు. చక్కగా మాట్లాడేవారున్న శక్తిని విదథ ప్రసాదించుమనే ప్రార్థనలున్నాయి.
పంచరుద్రమని ఋగ్వేదంలో ఉంది. ఇందు కూడా అట్టి ప్రార్థనలున్నాయి. పై లక్షణాలున్నవాడు సభేయుడు. రాచపుట్టుకతోబాటు, సభేయుడై రాజుండాలని మంత్రాలన్నాయి.
ఋగ్వేదం చివరలో ఈ సభేయులు ఎట్లా చర్చిస్తారో, ఎట్లా అమలు పరుస్తారో అనే విషయాలున్నాయి. ఇందలి సూక్తులు అందరికీ ఆమోద యోగ్యంగా ఉన్నాయని ప్రపంచ దేశాలు కీర్తించాయి. ప్రజా క్షేమమే మీ లక్ష్యంగా మీ భావాలు ఏకమవుగాక. ఉన్నతమైన భావాలతో, కలిసి మెలిసి మనస్సుతో ముందుకు సాగండి. మీ చిత్తము లేక మగుగాక, కలిసి నడవండి, కలిసి మాట్లాడండి అనేవి.
ఈ సభలలో వివిధ సంఘాలలో పెద్దలుండేవారు. అందు బ్రాహ్మణ పురోహితులు ఉన్నారనడం సబబు కాదు. పురోహితులతో బాటు గ్రామణి, సేనాని వంటి ముఖ్య అధికారులుండేవారు. గ్రామ ప్రజల బాగోగులను చూడటం గ్రామణి పని. సేనాని, యుద్ధ కార్యాలను వీక్షించేవాడు. అతడు సాధారణంగా క్షత్రియుడై యుండేవాడు. గ్రామణి యనగా బ్రాహ్మణుడే యై యుంటాడని భావించనవసరం లేదు.
రాజునకు పట్టాభిషేక సమయంలో అన్నివర్గాల ప్రతినిధులూ పాల్గొనే వారు. ఇట్లా రాచరికం, ప్రజాస్వామ్యం కలబోసిన వ్యవస్థగా సాగేది.
— దేవరకొండ శేషగిరిరావు గారి “నమో నమః” పరమాచార్య ఉపన్యాసాల సంగ్రహం
కంచిపరమాచార్యవైభవం




















