రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమాన పైలట్ శివాంగీ సింగ్‌తో కలిసి ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఆమెకు సంబంధించిన ఫేక్ వార్తలు పాక్ మీడియాలో రచ్చ పుట్టించాయి. అప్పట్లో సింగ్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్రపతి ముర్ముతో దిగిన ఫొటో మరోసారి ఆమెకు వార్తల ఫీడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
విమానంలో ఎగిరిన కలలు
శివాంగీ సింగ్ స్వస్థలం వారణాసి. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకుని, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. చిన్నతనంలోనే ఆకాశంలో ఎగరాలని కలలకనే ఆమె ఎన్‌సీసీలో చేరారు. 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ ప్రారంభించి, 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఎంపిక అయ్యారు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపే నైపుణ్యం కలిగి, 2020లో దేశంలోని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానం నడపే అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం అంబాలా ఎయిర్‌బేస్‌లో ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
రఫేల్ రాణిగా గుర్తింపు
2022లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రఫేల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శివాంగీ సింగ్ సెల్యూట్ చేస్తూ ఈ శకటంలో పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆమెను ‘రఫేల్ రాణి’గా గుర్తించారు. ఈ పోస్ట్ తర్వాత సోషల్ మీడియాలో ఆమెను నెటిజన్లు మరింత ప్రశంసించారు.
శివాంగీ సింగ్ ఘనత, కృషి, ప్రతిభ ద్వారా భారత వైమానిక దళంలో ఒక యువతీ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నారు. ఆమె ప్రేరణ యువతకు అద్వితీయమైన ఉదాహరణగా నిలుస్తుంది.




















