జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు సంపూర్ణంగా చేయాలని ఆమె సూచించారు.
ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హరీశ్‌తో పాటు ఆలయ ఈవో, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.50 కోట్లతో చేపట్టబోయే పనుల్లో ఎటువంటి రాజీకి తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. 2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.




















