ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద ఆరు కంపెనీలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రగతి పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్ణీత కాలంలో ఎంవోయూల అమలు వీలుగా కావడానికి చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ SIPB సమావేశం నిర్వహించబడింది. సమావేశం అనంతరం మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడారు. సీఐఐ సదస్సు మరియు పూర్వ ఒప్పందాల్లో 50% ప్రక్రియ ప్రారంభమయ్యిందని వెల్లడించారు.
‘‘విశాఖ పరిధిలో రూ.1.69 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతి పరిధిలో రూ.87 వేల కోట్లు, తిరుపతి పరిధిలో రూ.73 వేల కోట్లు పెట్టుబడుల ప్రక్రియ మొదలైంది. తాజా సమావేశంలో మొత్తం రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం ఇచ్చింది. 7.62 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 45 రోజులలో క్షేత్రస్థాయిలో అమలు కానుంది. ఇప్పటివరకు రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు జరిగాయి. వీటితో 16.13 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
దావోస్ ఫోరమ్‌కు ముందే అన్ని శంకుస్థాపనలను పూర్తి చేయాలని SIPB నిర్ణయించింది. రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించనుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు కోసం చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటక రంగంలో రూ.21 వేల కోట్ల, విద్యుత్ రంగంలో రూ.4.54 లక్షల కోట్ల, ఇండస్ట్రీస్ & కామర్స్‌లో రూ.2.02 లక్షల కోట్ల, ఐటీ రంగంలో రూ.1.22 లక్షల కోట్ల, ఫుడ్ ప్రాసెసింగ్‌లో రూ.8,519 కోట్లు, CRDA పరిధిలో రూ.45 వేల కోట్లు, మారిటైమ్ బోర్డు కింద రూ.1.6 లక్షల కోట్ల ఎంవోయూలు పూర్తయ్యాయి’’ అని మంత్రి టీజీ భరత్ తెలిపారు.



















