శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల పదోరోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి.. రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కొలువుదీర్చి.. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షరాన్, దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

















