చెన్నై (విల్లివాక్కం): తమిళనాడులో కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు టీవీకే (తమిళ వెట్రి కళగం) అధ్యక్షుడు విజయ్ పంపిన పరిహారం చర్చనీయాంశంగా మారింది.
తీవ్ర ఘటనలో మృతుల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షలు ఈ నెల 18న జమచేయడం జరిగింది. అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ సొమ్మును తిరిగి పంపారు. సంఘవి తెలిపినట్టు, “విజయ్ నేరుగా మమ్మల్ని కలుసుకొని ఓదార్చుతారని వీడియో కాల్‌లో చెప్పారు. ఆర్థిక సాయం ముందుగా తీసుకోవాలని సూచించారు. కానీ మాకు డబ్బు ముఖ్యమేమీ కాదు. మేము విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశాం. ఆయన ఆహ్వానించిన సమావేశానికి వెళ్లలేకపోయాం. కానీ మా పేరు వాడుకొని మా బంధువులు ముగ్గురు ఆ సమావేశానికి వెళ్లారు,” అని ఆమె వెల్లడించారు.
తమ ఇష్టానికి విరుద్ధంగా ఖాతాలో జమచేయబడిన రూ.20 లక్షల మొత్తాన్ని మళ్లీ తిరిగి పంపినట్టు సంఘవి తెలిపారు. ఈ సంఘటన సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది, ప్రజలలో ఈ నిర్ణయం ప్రశంసలకి గురైంది.




















