వికారాబాద్ నివాసి మదివాలా మచ్చదేవ్ తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ 46ను రద్దు చేయమని పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పేర్కొన్నట్లుగా, ఎంపిరికల్ డేటాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచకుండానే బీసీ రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణకు అవకాశం ఉంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జీవో 46పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 22%కి తగ్గించిన తీర్మానం బీసీ సంఘాల ఆగ్రహానికి కారణం. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను మళ్లీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో హామీ ఇచ్చి మోసం చేశారంటూ బీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ట్యాంక్ బండ్ వద్ద ఆందోళన, గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నాలు జరిగినా పోలీసులు అడ్డుకున్నారు. బీసీ సంఘాల నేతలు జీవో 46ను రద్దు చేసి న్యాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


















