ఎకరానికి కేవలం ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 20 శాతం వరకు తేమ ఉన్న పత్తినీ కొనుగోలు చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సీసీఐ ఎండీ లలిత్‌కుమార్ గుప్తాలకు లేఖ రాశారు.
తుమ్మల మాట్లాడుతూ – “అమెరికా ఒత్తిడికి లోనై కేంద్రం పత్తి దిగుమతులపై సుంకాలు ఎత్తివేయడం వల్ల దేశీయ రైతులు మార్కెట్లో గిట్టుబాటు ధర కోల్పోతున్నారు. ఇప్పుడు మరోవైపు సీసీఐ అసంబద్ధ ఆంక్షలు విధించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కిసాన్ కపాస్ యాప్‌లో నమోదు తప్పనిసరి చేయడం, జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2గా విభజించడం, తేమ శాతాన్ని 8–12 శాతానికి పరిమితం చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఎకరానికి సగటున 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇప్పటికే సీసీఐ రైతుల నుంచి ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసింది. ఇలాంటి సమయంలో 7 క్వింటాళ్లకు మించి కొనరాదని సీసీఐ జారీ చేసిన ఆదేశాలు అన్యాయం” అని పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులతో పాటు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని తుమ్మల లేఖలో డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో, సీసీఐ ఆంక్షలను తొలగించకపోతే గురువారం నుంచి పత్తి కొనుగోలు కార్యక్రమాలను నిరవధికంగా నిలిపివేస్తామని రాష్ట్ర కాటన్ జిన్నింగ్ మిల్లర్ల, వ్యాపారుల సంక్షేమ సంఘం హెచ్చరించింది. ఈ విషయమై సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి లేఖ అందజేశారు.


















