పరమాత్మని శక్తి స్వరూపిణిగా, జగజ్జననిగా భావిస్తూ పూజించే పరమోత్కృష్ట పండుగే విజయదశమి. ఘోర పాపాలకు పాల్పడిన మహిషాసురాది రాక్షసులను జగన్మాత సంహరించిన శుభసందర్భమిది. పరతత్వాన్ని పురుషరూపంలో, స్త్రీరూపంలో, నిరాకారంగా.. ఎలా ధ్యానించినా శక్తి మాత్రం ఒక్కటేనని చాటుతోంది దేవీపురాణం. అయితే ఆ పరబ్రహ్మాన్ని ‘అమ్మ’భావంతో ఆరాధించడంలో ఓ సౌలభ్యం ఉందని పేర్కొంది. అత్యధికులకు ఆమోదయోగ్యమైంది, అనుసరణీయమైంది ‘శ్రీమాత’ ఆరాధన అని వివరించింది.
దేవీపూజ సమాజాన్ని చైతన్యవంతం చేస్తుందని ఎందరో దేవీ ఉపాసకులు నిరూపించారు. అయితే ఆశ్వయుజ మాసంలో ఆ స్త్రీశక్తి రూపాన్ని తొమ్మిది దేవతామూర్తులుగా విభజించుకొని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చండిక, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి లేదా మహిషాసుర మర్దినీదేవి అనే నామాలతో తొమ్మిది రోజులూ పూజించి ఆ దేవిని ప్రసన్నం చేసుకోవటం సంప్రదాయం.
అమ్మవారి వైభవాన్ని విశేషంగా స్మరించుకునే పర్వదినమే విజయదశమి. ఇక్కడ విజయం అంటే లౌకికమైన గెలుపు మాత్రమే కాదు. అంతశ్శత్రువులపై ఆధిపత్యాన్ని సాధించటం అసలైన విజయం. ఆ జగద్ధాత్రి విజయరూపిణిగా మనకు సకల జయాలనూ ప్రసాదిస్తుంది. అసలు దుర్గాదేవి ఆవిర్భవించిన ఆశ్వయుజమాసం విజయ పరంపరకు ఆలవాలం. ఆ సమయంలో తలపెట్టిన ఏ సత్కార్యమైనా దేవీకటాక్షంతో విజయవంతమవుతుందని విశ్వసిస్తారు. రామాయణ, భారతాది ఇతిహాసాల్లో విజయదశమికి విశేష స్థానముంది. త్రేతాయుగంలో శ్రీరాముడు శమీ వృక్షాన్ని పూజించాడు. ద్వాపరయుగంలో అర్జునుడు కూడా శమీవృక్ష పూజతో విజయాల్ని కైవసం చేసుకున్నాడు.
అసురసంహారంలో ఆధ్యాత్మిక సందేశం
పరాశక్తి ఒక్కో అసురుని సంహారం వెనుక ఒక్కో మర్మార్థం దాగి ఉంది. ఉదాహరణకు ఆ భువనేశ్వరి పద్దెనిమిది భుజాల్లో ఆయుధాలు ధరించి మహిషాసురుణ్ణి సంహరించింది. మహిషాసుర మర్దినిగా పూజలందుకుంది. పురాణాల్లోని ఈ కథను మన జీవితాలకు అన్వయించుకుంటే- అందులోని ఆధ్యాత్మిక సందేశం అర్థమవుతుంది. మనిషిలోని దానవత్వానికి, పద్దెనిమిది దుర్గుణాలకు ప్రతీకే మహిషాసురుడు. అవి మనలోని దైవత్వాన్ని ప్రతిఘటిస్తూ, పతనానికి కారణమవుతుంటాయి. అమ్మ కృపతో అంతరంగంలో ఆ దానవ గుణాల్ని పారదోలి, దైవీగుణాలను ఆవిష్కరించుకుంటేనే మనకు నిజమైన విజయదశమి.
మనిషి కళంకితుడుగా మారటానికి కారణమయ్యేవి దశవిధ పాపాలు, అష్టవిధ పాశాలు. అసత్యం, దోషారోపణ, కఠిన ప్రవర్తన, వ్యర్థమైన పనులు, చౌర్యం, దుష్కర్మలు, దురాలోచనలు, పరస్త్రీవాంఛ, ఇతరుల సొమ్ముపై ఆశ, జీవహింస.. ఇవి దశవిధ పాపాలు. అసూయ, బిడియం, భయం, చింత, జుగుప్స, కులాభిమానం, శీలాభిమానం, కీర్తిప్రతిష్ఠల పట్ల మోజు- అనేవి అష్టవిధ పాశాలు. ఈ దుర్గుణాలను నశింప చేయడమే అమ్మవారి లక్ష్యం. అందుకే అష్టాదశ భుజాలతో అవతరించి మహిషాసురుణ్ణి సంహరించింది. కరుణామయి అయిన అమ్మ కన్నెర్ర చేయడం ఏమిటని సందేహం కలగవచ్చు. తల్లి బిడ్డను లాలిస్తుంది, పాలిస్తుంది. అవసరమైతే శాసిస్తుంది, దండిస్తుంది కూడా! మనం దారితప్పినప్పుడు అమ్మవారు అదృశ్యంగా శిక్షించటంలోని పరమ రహస్యం అదే! మహిషాసురుడు వంటి రాక్షసుల విషయంలో జగన్మాత వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం.
జగదంబ ఆరాధనతో జగతికి కల్యాణం
‘గృహేగృహే శక్తిపరైః గ్రామేగ్రామే వనేవనే’ అన్నది రుషివాక్యం. అంటే అమ్మవారి పూజలు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి వనంలోనూ నిర్వహించాలని భావం. జగదంబ ఆరాధనతో జగతికి కల్యాణం. ఆమె ధరించిన దుర్గాదేవి రూపం సంపూర్ణ అనుగ్రహానికి ఆలవాలం. ‘దుర్గ’ అంటే ఆశ్రయశక్తి అని మహర్షులు నిర్వచించారు. అలాగే ఆ దేవిని ‘తారిణీశక్తి’గా (కష్టాల సముద్రాన్ని దాటించగల శక్తి) అభివర్ణించారు. అంటే దాటించే శక్తి దుర్గ. కష్టాల కడలి నుంచి భక్తులను తీరానికి చేర్చే తల్లి ఆ మహాదేవి. అలాగే ‘దుర్గం’ అంటే కోట అని అర్థం. ప్రాపంచిక క్లేశాల నుంచి మనల్ని రక్షించే దుర్గం ఆ దుర్గాదేవి. ఆ దేవి రాక్షసుల్ని త్రిశూలంతో సంహరించింది. ఆమె ధరించిన త్రిశూలం భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీక. మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అసురులను, భక్తి జ్ఞాన వైరాగ్యాలనే మూడు శూలాలతో రూపుమాపాలని ఆ సంహరణలో సందేశం. ‘దుర్గ’ నామాన్ని సదా స్మరించేవారికి ఆపదలు తొలగిపోతాయని ‘దేవీమాహాత్మ్యం’ పేర్కొంది.
త్రివిధ పూజలు…
అమ్మవారి పూజను- సాత్విక, రాజసిక, తామసిక- అంటూ మూడు విధాలుగా వివరించింది ‘దేవీభాగవతం’. వేదోక్త మంత్రాలు, జపయజ్ఞాలతో నిర్వహించేది సాత్విక పూజ. అలంకారాలు, ఆడంబరాలతో చేసేది రాజసపూజ. తాంత్రిక విద్యలతో జరిపేది తామసపూజ. అయితే తామస పూజ నుంచి సాత్వికపూజకు ఎంత త్వరగా పురోగతి సాధిస్తే మనం అంత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లినట్లు. ఈ సాత్వికపూజ వల్ల మనకు, ఆ జగన్మాతకు మధ్య అనుబంధం మరింత ఇనుమడిస్తుంది. మనసు అంతర్ముఖమవుతుంది. మనలో జ్ఞానం వికసిస్తుంది.
కవులకూ కల్పవల్లి…
దేవీ ఉపాసకులే కాదు కాళిదాసాది మహాకవులు కూడా ఆ జగద్ధాత్రిని ఆరాధించి తరించినవారే. ఎందరో భక్తకవులు ఆ భగవతిని తమ పాలిట కల్పవల్లిగా స్తుతించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘హే జననీ! హే జననీ! తామసగుణ మహిషాసుర మర్దినీ..’ అంటూ నీరాజనాలర్పించారు. విశ్వకవి రవీంద్రుడు ‘గీతాంజలి’ కవితా సంపుటిలో- ‘అమ్మా! నా దుఃఖాశ్రువులతో నీకు ముత్యాల హారాన్ని సమర్పిస్తాను. నా హృదయంలో నిండిన బాధను నీకు తప్ప మరెవరికీ నివేదించలేను. ఈ నైవేద్యంతో నీ అపార కృప నాపై ప్రవహిస్తుంది. ఆనందభిక్ష సంప్రాప్తిస్తుంది’ అని జగన్మాతకు విన్నవించుకున్నారు. శక్తిపూజా సంప్రదాయానికి నెలవైన బెంగాల్‌లో రవీంద్రులు రాసిన ఈ గీతం దేవీస్తోత్రంగా ప్రసిద్ధమైంది.
ప్రతిమల పూజకే పరిమితం కాకుండా..
విజయదశమి పండుగ రోజుల్లో పరాశక్తి పూజలు ప్రతిమలకే పరిమితం కాకుండా మనం పరిణతి చెందాలి. ప్రతి స్త్రీమూర్తినీ జగన్మాత ప్రతిరూపంగా చూడగలిగే సంస్కారాన్ని అలవరచుకోవాలి. అందుకే మాతృవత్ పరదారేషు- అన్నారు. అంటే పరస్త్రీ తల్లితో సమానమని భావం. ఈ పర్వదినాల్లో శక్తి ఆరాధన సంవత్సరమంతా ప్రభావితం చేస్తుండాలి. అమ్మవారి ప్రతిమల్ని నీటిలో నిమజ్జనం చేసినా, ఆ స్ఫూర్తి మన అంతరంగంలో చెరగని ముద్రగా మిగిలిపోవాలి. అప్పుడే మనది నిజమైన ఆరాధన అనిపించుకుంటుంది. అమ్మ అవ్యాజ కృప మనపై ప్రసరిస్తుంది.




















