జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. జన్యుపరమైన అంశాలను పక్కన పెడితే, మానసిక ఒత్తిడి, శారీరక అసమతుల్యత, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా హెయిర్‌ఫాల్ సమస్య అందరికీ సాధారణమైపోయింది. చాలా సార్లు జుట్టు పల్చబడటం, చుండ్రు రావడం, కుదుళ్లు బలహీనపడటం వంటి లక్షణాలు మన శరీరంలోపల ఉన్న సమస్యలకు సంకేతాలు.
శాంపూలు, ఆయిల్ మార్చడం వల్ల సమస్య పూర్తిగా తగ్గదు. మన శరీరంలో జరిగే మార్పులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరిగితే జీర్ణ సమస్యలు వస్తాయి, వాటి ప్రభావం కూడా జుట్టుపై పడుతుంది. కాబట్టి ముందుగా ఒత్తిడిని నియంత్రించుకోవాలి. జీర్ణ సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించాలి.
ఇవి క్రమబద్ధమైన తర్వాత ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇక్కడ చెప్పే ఈ స్మూతీని ప్రతిరోజూ తాగితే జుట్టు ఊడే సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
తయారీ విధానం:
పది బాదంపప్పు, పది జీడిపప్పు, ఒక టేబుల్‌స్పూన్ గుమ్మడి విత్తనాలు, ఒక టేబుల్‌స్పూన్ బ్లాక్ రెజిన్స్, ఒక టేబుల్‌స్పూన్ ఎండుద్రాక్ష, నాలుగు ఖర్జూరాలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. తగినంత నీరు కలిపి స్మూతీలా చేసుకోవాలి.
రోజు ఉదయాన్నే ఈ స్మూతీ తాగితే జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పుష్టిని అందించి, అనేక ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.


















