ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడింపు:
సేవలు నిలుపకండి… సమస్యను సీఎంతో చర్చిస్తానని మంత్రి సత్యకుమార్
అమరావతి: ఈ నెల 10 నుండి ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 2,700 కోట్ల రూపాయల పైగా ఉన్నాయని, నెలనెలా బకాయిలు పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి ఉపశమన చర్యలు తీసుకోడంలేదని ఆషా అధ్యక్షులు కె. విజయ్‌కుమార్, కార్యదర్శి సీహెచ్ అవినాశ్ తెలిపారు.
గత ఏడాదిలో ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను కలిసినప్పటికీ ఫలితం లభించలేదని, గత నెల 25న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించామని వెల్లడించారు. అందువల్ల ఈ నెల 10 నుండి వైద్యసేవలను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. అయితే, ఈ ఆందోళన కారణంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకోవాలని ఆషా ప్రభుత్వం కోరింది.
గత ప్రభుత్వ బకాయిలు విడతలవారీ చెల్లిస్తున్నాం – మంత్రి సత్యకుమార్
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలు ఆపకూడదని మంత్రి సత్యకుమార్ సూచించారు. వైకాపా ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులకు 2,500 కోట్ల రూపాయల బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం వాటిని విడతలవారీగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. సమస్యను ముఖ్యమంత్రి సీఎంతో చర్చిస్తానని, ప్రజలకు ఇబ్బంది రాకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు.
అంతేకాక, ఇన్ సర్వీస్ కోటా విషయంలో మెరిట్ విద్యార్థుల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని, పీహెచ్‌సీ వైద్యులు ఆందోళనను విరమించి చర్చలకు రావాలని మంత్రి సూచించారు.




















