భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంతో టీమ్‌ఇండియా రూ.39 కోట్ల ప్రైజ్‌మనీని కైవసం చేసుకుంది. 47 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసింది. మిథాలీ రాజ్ నాయకత్వంలో రెండుసార్లు ఫైనల్‌కు చేరినా విజయం సాధించలేకపోయిన భారత్ ఈసారి ఏ తప్పూ లేకుండా సఫారీ జట్టును చిత్తు చేసింది.
ఈ విజయం నేపథ్యంలో బీసీసీఐ నుంచి భారత జట్టుకు భారీ బహుమతి లభించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటన చేస్తూ – “జై షా నాయకత్వంలో 2019-24 మధ్య మహిళా క్రికెట్‌కు విశేష ప్రాధాన్యం లభించింది. ఐసీసీ ఛైర్మన్‌గా కూడా ఆయన మహిళా క్రికెట్ పురోగతికి కృషి చేశారు. ఇప్పుడు ప్రపంచకప్ విజేతలైన భారత జట్టుకు బీసీసీఐ తరఫున రూ.51 కోట్ల నజరానా అందజేస్తున్నాం. ఇది ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి పంచబడుతుంది’’ అని తెలిపారు.
“1983లో కపిల్‌దేవ్ సేన భారత్‌కు తొలి ప్రపంచకప్ గెలిపించినట్లు, ఇప్పుడు మా మహిళా జట్టు కూడా చరిత్ర సృష్టించింది. ఈ విజయం దేశంలోని యువతకు ప్రేరణగా నిలుస్తుంది’’ అని ఆయన అన్నారు.
ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ – “మహిళా క్రికెట్‌లో పెట్టుబడులు పెంచడం, పురుషుల క్రికెటర్లతో సమాన వేతనాలు, కోచింగ్ సిబ్బంది పునర్నిర్మాణం వంటి కీలక నిర్ణయాలు ఈ విజయానికి పునాది’’ అని పేర్కొన్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కూడా మహిళా జట్టును అభినందించారు. “మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, జట్టు సమన్వయం దేశానికి స్ఫూర్తి. మీరు చూపిన ప్రదర్శన భావితరాలకు ఆదర్శం’’ అని ఆమె తెలిపారు.




















