రంగారెడ్డి జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలంటూ సూచించారు.
అధికారుల వివరాల ప్రకారం, టిప్పర్ తప్పు మార్గంలో వచ్చి బస్సును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు మంత్రి తెలిపారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడుతో వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో కంకర బస్తాలు బస్సుపై పడిపోయాయి. ఫలితంగా పలువురు ప్రయాణికులు దానికింద చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.




















