ముంబయి: మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ వేడుకలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తేందూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వెలుగుల కాంతుల్లో ప్రపంచకప్ ట్రోఫీతో మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానుల హర్షధ్వానాలతో డీవై పాటిల్ స్టేడియం మార్మోగిపోయింది. భారత జట్టుతో కలసి సచిన్ పలకరించి, వారికి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్‌కు హాజరయ్యాడు.
ఫైనల్ ప్రారంభానికి ముందు ప్రముఖ గాయని సునిధి చౌహాన్ ‘జనగణమన’ ఆలపించి దేశభక్తి ఉత్సాహాన్ని రగిలించింది. అనంతరం 60 మంది డ్యాన్సర్లతో సునిధి చేసిన అద్భుత నృత్యప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి రూపొందించిన ఫైర్‌వర్క్స్, డ్రోన్ షో, లేజర్ ప్రదర్శనలు స్టేడియం వాతావరణాన్ని మరింత రంగులమయం చేశాయి.




















